Co-Operative Electric Supply Society Ltd. Sircilla
సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్లను జాతీయ గ్రామీణ విద్యుత్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (ఎన్ అర్ ఇసి ఏ) ప్రతిపాదనలతో పైలట్ ప్రాజెక్టుగా అప్పటి ఉమ్మడి కరీం నగర్ జిల్లా లోని వెనుకబడ్డ సిరిసిల్ల తాలూకా యందు గ్రామీణ విద్యుదీకరణను త్వరితగతిన చేపట్టుటకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ న్యూడిల్లి వారి ఆర్థిక సహాయముతో స్థాపించడము జరిగింది.
సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) నవంబర్ 1, 1970 లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థకి 1974, జులై 13 స్వంత భవనానికి ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి మర్రి చెన్నా రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవము జరిగింది. 1970 లో 46 గ్రామాలతో సేవలందించడం ప్రారంభించిన ఈ సహకార సంఘం ప్రస్తుతము రాజన్న సిరిసిల్ల జిల్లాలో 230 గ్రామాలకు తన సేవలు అందిస్తోంది. చేనేత కార్మికులకేకాక గృహ, పారిశ్రామిక, వ్యవసాయ మరియు వీధిదీపములకు కూడా ఈ సంస్థ నుండి విద్యుత్ సరఫరా చేయబడుతోంది.
ఈ సంస్థను ప్రారంభించుటకు ముఖ్య ఉద్దేశం, సిరిసిల్ల మెట్ట ప్రాంతము లోని ఆహార ఉత్పత్తులను పెంచి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచటం 1970-71 ప్రారంభంలో, 2299 వ్యవసాయ సర్వీసులు మరియు 2421 ఇతర తరగతుల సర్వీసులు ఉంటే ఇప్పుడవి 66,811 వ్యవసాయ సర్వీసులు మరియు 1,62,656 ఇతర తరగతుల సర్వీసులు వెరసి మొత్తము 2,29,467 విద్యుత్ సర్వీసులకు ఈ సహకార సంఘం విద్యుత్ సరఫరా చేస్తున్నది. నీటి వసతులు సరిగ్గా లేక కరెంటు కనెక్షన్ ద్వారానే సేద్యం చేసే రైతన్నలకి ఈ సహకార సంఘం చేదోడుగా నిలుస్తోంది. సిరిసిల్లతో పాటు ఇలాంటి సహకార సంఘాలు భారతదేశంలో మరో నాలుగు, 1. హుకేరి (కర్నాటక), 2. కొడినూరు (గుజరాత్) 3. లక్నో (ఉత్తర ప్రదేశ్) మరియు 4. మూల ప్రవారా (మహారాష్ట్ర) నందు ప్రారంభించినారు. తదనంతరం ఆంధ్ర ప్రదేశ్ లోని చీపురుపల్లి, అనకాపల్లి, కుప్పంల యందు కూడా ఇట్టి సహకార విద్యుత్ సరఫరా సంఘాలు ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) ను స్థాపించిన నాటి నుండి కార్యకలాపాలు విజయవంతంగా సాగటానికి, ఈ సంస్థ యొక్క సిబ్బంది మరియు పాలక వర్గం కృషి ఎంతైనా వుంది. పేదబడుగు వర్గానికి సేవలందిస్తున్న ఈ సంఘం, దీన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సిబ్బంది మరియు పాలక వర్గం ఎప్పటికీ అభినందనీయులు.